Friday, April 17, 2015

ప్రపంచానికి ఫైర్ఫాక్స్ ఇప్పుడు అత్యంతవసరం

నేను గతంలో ఎన్నోసార్లు ఇతరులతో చెప్పినట్టు, సలహా ఇచ్చినట్టు ప్రపంచానికి ఫైర్ఫాక్స్ అవసరం ఉంది. స్వేచ్ఛా సాఫ్టువేర్ల గురించి పరిచయం లేని వారికి దాన్ని గురించి చెప్పటంలో ఫైర్ఫాక్స్ చేసే సహాయం అంతా ఇంతా కాదు. అయితే ఫైర్ఫాక్స్ కి నేడున్న ప్రధాన సవాళ్ళలో ఒకటి ఈ కింది ట్రెండ్ ను తిరగరాయటం :


Browser share - Firefox and Internet Explorer decline while Chrome increases its share
వివిధ వికీపీడియన్ల ద్వారా, CC BY 3.0
నా అంచనా ప్రకారం ఫైర్ఫాక్స్ ఎదుగుదలకు అతిపెద్ద అవరోధం - లేదా తన ప్రస్తుత మార్కెట్ షేర్ ను కాపాడుకోటంలో గల అవరోధం - జనాల నరనరాల్లోకీ పాతుకుపోయిన "గూగుల్ క్రోమ్ అంటే మెరుగైన బ్రౌజర్ (విహారిణి)" అనే అపోహ.
ఆండ్రాయిడ్ ఉపకరణాల్లో అప్రమేయంగా క్రోమ్ ఉండటం ఐఓఎస్ లో క్రోం పని చేయటం మొదలయినవి క్రోం కు ఉన్న ప్రత్యేకతలు. అదే ఫైర్ఫాక్స్ కావాలంటే వాడుకరి ప్రత్యేకించి ఆండ్రాయిడ్ ఉపకరణంలో స్థాపన చేసుకోవాలి. ఐఓఎస్ కి అందుబాటులో లేదు కూడా (భవిష్యత్తులో రావచ్చేమో!). అన్నిటికన్నా మించి గూగుల్ వద్ద ఉన్న వాణిజ్య ప్రకటనల అతిపెద్ద సామ్రాజ్యం ద్వారా క్రోం ను ప్రయత్నించమని, అతి మెరుగైన, త్వరితగతిన పని చేసే విహారిణి క్రోమే అన్న ప్రచారంతో మొజిల్లా వారి ఫైర్ఫాక్స్ ప్రచార ప్రయత్నాలను పటాపంచలు చేస్తుంది క్రోం.

ఇక్కడ విహారిణుల విషయమై ఏకఛత్రాదిపత్యం ఎందుకు కూడదు, ఎల్లపుడూ విహారిణుల మధ్య పోటీ ఎందుకు ఉండాలి అన్న విషయమై విశ్లేషిద్దాం. 2000వ దశకంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి విరుద్ధంగా ఫైర్ఫాక్స్ జరిపిన పోరాటాన్ని, ప్రస్తుతం ఫైర్ఫాక్స్ ఎదుర్కొంటున్న సవాళ్ళనూ పరిశీలిద్దాం. అలాగే ఫైర్ఫాక్స్ ఏ విధంగా తన పతనాన్ని (లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని) ఎలా ఎదుర్కోవచ్చు అన్న విషయం కూడా పరికిద్దాం.

నేపధ్యం : విహారిణుల మధ్య పోటీ ఎందుకు ఉపయోగకరం

ఏ రంగంలోనైనా ఆఖరి వాడుకరి మేలు కోసం ఉత్పత్తుల నడుమ పోటీ ఉచితమే. తద్వారా వచ్చే లాభాలు అనేకం. ఎవరైనా అడగొచ్చు : గూగుల్ క్రోమ్ విహారిణుల రంగంలో అగ్రగామి అయితే ఎంత? ఏనాటికైనా ప్రతి వాడుకరికీ విహారిణిని మార్చుకునే అవకాశం ఉన్నంతవరకూ ఈ విషయంలో నష్టమేమీ లేదు కదా అని.
కానీ అలాంటి భావాలు మనం మాఅర్చుకోవాలి. దానికెన్నో కారణాలు.
ఒక విహారిణి ఏకాధిపత్యం చెయ్యటం మొదలుపెడితే విహారిణి ఆధారిత సేవలు అందించే కంపెనీవాళ్ళంతా ఆ ఒక్క విహారిణిని దృష్టిలో పెట్టుకుని మిగితా విహారిణులను నిర్లక్ష్యం చేస్తూ సేవలు రూపొందిస్తారు. ఉదాహరణకి వెబ్ డెవలపర్లు వారి వాడుకరులు అధికం క్రోమ్ ను వాడుతున్నారని మిగితా విహారిణులపై తమ ఉత్పత్తులను పరీక్షించడం మానేయవచ్చు.
మరొక ముఖ్యమైన విషయం అలాంటి సందర్భంలో ఆ ఒక్క విహారిణి యజమానుదారుడు/హక్కుదారుడు విహారిణి-జాలం-అంతర్జాలం నియమాలను నిబంధనలను శాసించడం మొదలుపెడతారు. ఆ విధంగా ప్రత్యర్థి విహారిణులు అలాంటి నిబంధనలకు లోబడకపోతే తమంతట తాముగా వాడకం నుండి వైదొలగుతాయి. అక్కడ మొదలు అందరికీ అన్ని వసతులు సమానంగా కాకుండా కొందరికే కొన్ని వసతులే అన్న నినాదాలు సమాజాన్ని పట్టి పీడిస్తాయి. ఇదే రకం పోకడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్  6 విహారిణుల రారాజుగా ఉన్న రోజుల్లో తెరపైకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ యధేచ్ఛగా తనకు కావాల్సిన ప్రకటనలు, వైరస్లు, తద్వారా ఆంటివైరస్లు, వాడుకర్ల సమాచారం లాంటివి నడుపుకునేందుకు ఈ విహారిణిని బాగా వాడుకుంది. ఈ పరిస్థితి ఫైర్ఫాక్స్ వచ్చి పోటీకి నిలబడ్డ నాడు మాత్రమే శమించింది.

ఈ సారో కొత్త రకం జగడం

ఇంతకు ముందు జరిగిన విహారిణుల సమరం (ఇది ఇలాంటి రెండో యుద్ధం) చాలా సులువైనది. ఎన్నో సంవత్సరాలుగా మారని వ్యర్థమైన విహారిణి (ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్) కి విరుద్ధంగా సరికొత్త మెరుగైన ఉత్పత్తి ఫైర్ఫాక్స్ ఉంది. ఆ రోజుల్లో ఫైర్ఫాక్స్ అందించిన ట్యాబుల విహరణ ఒక పక్కైతే, నాలుగైదు కిటికీలతో రోతగా ఉన్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మరో పక్క.
కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. ఈ సమరం చాలా భీకరంగా ఉంది. అన్ని ఉత్పత్తులు చూడటానికి ఒకేలా ఉన్నాయి. ఫైర్ఫాక్స్ ట్యాబులను అందంగా వంకీలు తిరిగి ఉండేలా రూపొందించిన వెంటనే అది క్రోమ్ లో ప్రత్యక్షమయింది. రెండు విహారిణులూ చాలా వరకూ వివరాలను తగ్గించి, దృశ్యపరంగా మరింత నాజూకుగా కనపడేలా తయారయ్యాయి. నాజూకుగా కనపడటమే కాదు, పని చేయటంలోనూ రెండిటికీ వేగమే. రెండు విహారిణులు వాడుకరి ప్రాధాన్యతలు గుర్తు పెట్టుకొని లాప్టాప్, డెస్క్టాప్, మొబైల్, ట్యాబ్ లలో వాడినపుడు ఒకేలా ఉండేలా, సంకేతపదాలు, విహరణ చరిత్ర, పొడిగింతలు ఒకచోట ఉన్నవి మరో చోట పని చేసేలా కుదుర్చుకున్నాయి.
కానీ తేడాలు ఉన్నాయి. అందులో ఒకటి రెండిటినీ నడిపించే సిద్ధాంతాలు వేరు వేరు.
ఫైర్ఫాక్స్ ను తీర్చిదిద్దిన మొజిల్లా కార్పరేషన్ మొజిల్లా ఫౌండేషన్ అనే ఒక లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. కానీ క్రోమ్ గూగుల్ ద్వారా తయారు కాబడింది. ఇంటర్నెట్ పై ఏకఛత్రాధిపత్యం కోసం పాటుపడుతూ, ఎన్నడూ లేనంతగా వాడుకరుల సొంత సమాచారాన్ని తస్కరిస్తూ, లాభాల కోసం వాడుకొనే ఒక సంస్థ గూగుల్. ఫైర్ఫాక్స్ ను రూపొందించేది మీరు-నేను మనమే, ఔత్సాహికుల ద్వారా రూపొందుతుంది. సర్వ మానవ కల్యాణం, ఇంటర్నెట్ ను అందరికీ మరింత మెరుగ్గా, దాపరికాల్లేకుండా చేరువలోకి తేవటం. అదే క్రోమ్ విషయంలో, దాని రూపకర్త గూగుల్ కు డబ్బే లక్ష్యం. గూగుల్ అందించే వివిధ సేవలకు క్రోమ్ వేదిక.
ఫైర్ఫాక్స్ క్రోమ్ కన్నా మెరుగు అనేందుకు మరొక్క కారణం ఫైర్ఫాక్స్ వాడే ఓపెన్ సోర్స్ విధానం. ఫైర్ఫాక్స్ ఆపాదమస్తకమూ పూర్తి స్థాయిలో సోర్స్ కోడ్ అందుబాటులో ఉన్న విహారిణి. అందువలన మీకు నచ్చిన విధంగా సోర్స్ కోడ్ లో మార్పులు చేసి మీ వరకూ వాడుకోవచ్చు, ప్రపంచానికి అందించవచ్చు కూడా. క్రోమ్ కోడ్ స్వేచ్ఛా సాఫ్టువేర్ క్రోమియం నుండి తీసుకున్నప్పటికీ ఆపైన చాలా వరకూ బాహ్యంగా అందుబాటులో లేని తెలీని రహస్యమైన కోడ్ చాలా వరకూ క్రోం వాడుతుంది. సముదాయం కోసం సముదాయ సభ్యులు రూపొందించిన విహారిణి ఎప్పటికైనా సముదాయం కోసం బయటి కంపెనీ రూపొందించిన ఉత్పత్తి కన్నా మెరుగ్గా పని చేయగలదు.
గమ్మత్తైన విషయమేమిటంటే ఈ విషయాలు సామాన్యుడికి ఎలా తెలపాలి. సాధారణ జనాల వరకూ ఈ విషయాలను ఎలా తీసుకుపోవాలి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6 కన్నా ఫైర్ఫాక్స్ మెరుగని ఎవరైనా ఇట్టే చెప్పెయ్యగలరు. కానీ క్రోం కన్నా ఫైర్ఫాక్స్ మెరుగని ఎలా చెప్పగలం?
మన వ్యక్తిగత విషయాల గోప్యత విషయంలో ఫైర్ఫాక్స్ మెరుగని చూపించి మరీ చెప్పగలం.

ఫైర్ఫాక్స్ పైచేయి

ఫైర్ఫాక్స్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కానీ అన్నిటికన్నా మన గోప్యతను కాపాడటంలో ఫైర్ఫాక్స్ పైచేయి లో ఉంది. క్రోం ద్వారా గూగుల్ వాడు మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నాము అన్న విషయంతో సహా పసిగట్టేస్తున్నాడు (https://maps.google.com/locationhistory/b/0)
ఫైర్ఫాక్స్ ఎప్పటికి ఇలాంటి చర్యలకు పాల్పడదు, అలా చెయ్యాలనుకునే గూగుల్ కూడా ఫైర్ఫాక్స్ మీద వాడుతున్నపుడు మన చర్యలను పసిగట్టనీయకుండా నిర్వీర్యం చేసే అస్త్రాలు ఫైర్ఫాక్స్ వద్ద ఉన్నాయి. about:config కు వెళ్ళి ఒక చిన్న మార్పు చేయడం ద్వారా ఎలాంటి సంస్థ మన అడుగుజాడల్ని అనుసరించకుండా అరికట్టవచ్చు (ప్రివసీ బాడ్జర్ పొడిగింత లా పని చేస్తుంది). ఫైర్ఫాక్స్ ద్వారా మీ బ్యాంకు అకౌంట్ వివరాల లాంటి సున్నితమైన అంశాలను వేరే ఎవ్వరూ (తస్కరించకుండా) దుర్వినియోగం చేయకుండా అరికడుతుంది.
ఫైర్ఫాక్స్ వారి మొదటి పేజీలోజాలసురక్షకు సంబంధించిన సూచనలూ ఉంటాయి.
అదే సమయాన క్రోమ్, గూగుల్ మీ కదలికలు, మీ వెబ్సైట్ సందర్శనాలు, మీరు చేసే ప్రతి చర్య మీద నిఘా వేసి ఉంచుతారు. తద్వారా మీ అలవాట్లను తెలుసుకుని తగిన వాణిజ్య ప్రకటనలు మీకు చూపిస్తారు.
దీని ద్వారా నాకూ కొంత మేలుందోయ్, నాకు తగ్గ ప్రకటనలు నేను వెతక్కుండానే నా చెంతకొస్తున్నాయని మీరంటారా! అయితే అదే సమయంలో మీరు మీ అతి సన్నిహితులతో జాలం ద్వారా మాట్లాడే (చాటింగ్/మెయిల్/వెబ్) సున్నితమైన, మీకు మాత్రమే వ్యక్తిగతమైన విషయాలు కూడా మీరు అదే విధంగా గూగుల్ కు అందిస్తున్నారన్న సంగతి మరవద్దు.

బేసిక్ గా, ఫైర్ఫాక్స్ క్రోం వాడకం ఒకేలా ఉంటుంది, రెండిటా వాడే ఉపకరణాలూ ఒకేలా ఉంటాయి. కానీ అవి లోలోపల పని చేసే విధానంలోనే చాలా తేడా ఉంది. ఒకటి మీ వ్యక్తిత్వానికి వ్యక్తిగత విషయాలకూ ప్రాధాన్యతనిచ్చి గోప్యత పాటిస్తే, మరొకటి మీ విషయాలన్నిటిని స్వార్ధ పూరిత కంపెనీలకు అమ్ముకునే దత్తాంశాలుగా పరిగణిస్తుంది. ఒకటి సమూహం ద్వారా సమూహం కోసం రూపొందితే, మరొకటి లాభాల కోసం జనాల వ్యక్తిగత విషయాలను నిఘావేసే సంస్థ కోసం రూపొందింది.
రెంటిలో మీ ఎంపిక ఏదో వేరే చెప్పనక్కరలేదేమో.


(Harry Chapman ఆంగ్ల బ్లాగు టపాకు తెలుగు అనువాదం, Creative Commons Licence ద్వారా లభ్యం )

Saturday, October 5, 2013

ఫైలు అనుమతులు మరియు అంశాలను మార్చటం

chmod 755 sample.file : sample.file అనే దస్త్రం యొక్క అనుమతులు యజమానికి - rwx, యజమాని సమూహానికి rx మరియు ఇతరులకు rx
chgrp grp12 file : file అనే దస్త్రాన్ని grp12 అనే సమూహానికి సంబంధించినదిగా చేయి
chown usr12 file : file అనే దస్త్రాన్ని usr12 అనే వాడుకరికి సంబంధించినదిగా చేయి
chown -R usr12 dir1 : dir1 అనే సంచయానికి usr12 ను యజమానిగా చేయి(లోపలి దస్త్రాలు ఉపసంచయాలతో సహా)పైన చెప్పినవి ఏది చెయ్యాలన్నా వాడుకరి ఆ దస్త్రం/సంచయం యొక్క యజమాని అయి ఉండాలి.

Friday, October 4, 2013

డైరెక్టరీ లోని వస్తువిషయాలు చూడటం


డైరెక్టరీని టెర్మినల్ ద్వారా చూసినపుడు ఆ డైరెక్టరీకి సంబంధించిన సూక్ష్మ విషయాలు పరికించవచ్చు.
ls : డైరెక్టరీని స్థూలంగా చూపు(దస్త్రాలను, సంచయాలనూ చూపిస్తుంది)
ls -l : డైరెక్టరీని విస్తృతంగా చూపు

ఉదాహరణకు :
$ ls -l
drwxr-xr-x    4 grp    user1        1024 Jun 18 09:40 file1
-rw-r--r--    1   grp    user1      767392 Jun  6 14:28 file2
^ ^  ^  ^     ^   ^       ^           ^      ^    ^      ^
| |  |  |     |   |       |           |      |    |      |
| |  |  |     | యజమాని   సమూహం      పరిమాణం   తేదీ  సమయం      పేరు
| |  |  |     ఈ దస్త్రానికి లేదా సంచయానికి గల లంకెల సంఖ్య
| |  |  మిగితా వారికి అనుమతులు
| |  యజమాని సమూహానికి అనుమతులు
| యజమానికి అనుమతులు: r =చదవవచ్చు, w = మార్చవచ్చు, x = ఆడించవచ్చు -=ఏ అనుమతీ లేదు
దస్త్రం రకం: - = మామూలు దస్త్రం, d=డైరెక్టరీ, l = సింబాలిక్ లింక్


ls -a : దాచి ఉంచిన దస్త్రాలతో సహా చూపించు(దాచి ఉంచిన దస్త్రాలు పేరు ముందు . కలిగి ఉంటాయి)

దస్త్ర వ్యవస్థ తిరగాడటం

pwd : ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీని చూపించు
cd : ప్రస్తుత డైరెక్టరీని మీ హోం డైరెక్టరీకి మార్చండి
cd /usr/హోం: ప్రస్తుత డైరెక్టరీని /usr/హోం కి మార్చండి
cd next : next అని ఉన్న ఉపసంచయానికి ప్రస్తుత డైరెక్టరీని మార్చండి
cd .. : మీ హోం డైరెక్టరీకి ప్రస్తుత డైరెక్టరీని మార్చండి
cd $bar : $bar ద్వారా నిర్దేశించబడిన దోవకు ప్రస్తుత డైరెక్టరీని మార్చండి
cd ~foo : foo అనే వాడుకరి హోం డైరెక్టరీకి(మీకా అనుమతి ఉంటే) ప్రస్తుత డైరెక్టరీని మార్చండి

సంచయాలు(Directories)

లినక్స్ లో సంచయాలు ఇంకా దస్త్రాల తోవలు "/" ద్వారా డైరెక్టరీ పేర్లను వేరు చేస్తూ ఉంటాయి.
ఉదాహరణ: / "రూట్" సంచయం /usr usr సంచయం ( / "రూట్" సంచయం యొక్క ఉపసంచయం) /usr/హోం హోం అనేది /usr యొక్క ఉపస్ంచయం

లినక్స్ కమాండ్లలో ./ (డాట్ స్లాష్)

లినక్సులో కమాండులను టైపు చేసినప్పుడు ./ ను తరచూ వాడుతుంటాము. కొత్తగా లినక్స్ వాడేవారికి ఇది వింతగా అనవసరంగా అనిపించవచ్చు. కానీ ఇది ఎంతో ఉపయోగకరం. లినక్స్ లో కమాండులు రెండు రకాలు - అంతర్గతం మరియు ఆడించేవి. alias, cd, echo, kill, ls మరియు pwd వంటివి షెల్ లో అంతర్గతాలు అందువలన షెల్ వీటిని గుర్తించి ఆడించగలదు. కానీ ఆడించదగ్గ అంతర్గతం కాని కమాండులు ఆడించాలంటే వాటి జాడను షెల్ గుర్తించాలి. షెల్ అనేది పాఠ్యం ద్వారా ఇచ్చే ఆజ్ఞలను ఆడించే ఒక ఉపకరణం. షెల్ కు కమాండ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించేందుకు PATH అనే ఒక దత్తాంశం ఉంటుంది. ఈ PATH లో లేని డైరెక్టారీని వాడే సందర్భంలో ఆ ప్రోగ్రాం టెర్మినల్ ఉన్న డైరెక్టరీలో ఉండగా ఈ ./ ను వాదవచ్చు. ఉదాహరణకు run-this అనే ఆడించదగ్గ కార్యక్రమం ప్రస్తుత డైరెక్టరీలో ఉంటే, దానిని ఆడించేందుకు ./run-this అని కమాండ్ లైన్ లో టైప్ చేస్తే సరిపోతుంది.

ఈ టపాను పంచుకోండి