Monday, December 26, 2011

కన్సోల్ -- లినక్స్ లో తొలి అడుగులు


కన్సోల్ అన్నా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్నా షెల్ అన్నా టెర్మినల్ అన్నా ఒకటే.
ఒక నల్లని తెర పై చిన్ని చిన్ని నిర్దేశాలను కేవలం కీబోర్డ్ వాడి చొప్పించడాన్ని చూసే ఉంటారు, అక్కడ మౌస్ ని ఉపయోగించరు. ఇది సాధారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆధారిత నివ్య లో కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది.
లినక్స్ వాడుకరులకు అత్యంత సౌలభ్యాన్ని అందిస్తుందీ కన్సోల్.
మొదట్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నా, వాడే కొద్దీ రాముడి బంటు హనుమంతన్నలా మీ పనులు చేస్తుంది. ఒక ఉదాహరణ, ఒక సంచయంలోని అన్ని దస్త్రాల పేర్లూ ఆఖరున మీ పేరు జోడించాలి; అదీ, ఆ సంచయంలో ఒక వంద దస్త్రాలు ఉన్నాయనుకుందాం. ఎంత సమయం పడుతుందీ పనికి? కన్సోల్ లో ఒక క్షణం కూడా పట్టదు, పైగా మీరు ఒకటి-రెండూ మహా అయితే ఆరు లైన్లు చొప్పించాలి అంతే!
ఒక్కో లినక్స్ పంపకంలో ఈ కన్సోల్ ఒక్కోలా ఉంటుంది. మీ మెషీన్ లో వాడుకరి పేరు తరువాత @ తరువాత మెషిన్ పేరు, అప్రమేయ సంచయంలో మీ ప్రాంప్ట్ తో ఉంటుంది.
user@linux ~/$ 
ఉదాహరణకు వాడుకరి పేరు linuxudu, మెషిన్ పేరు tuxnani.in, సంచయం /home/tuxnani/f1 అనుకోండి, అప్పుడు ప్రాంప్ట్ కింద చూపిన విధంగా ఉంటుంది.
linuxudu@tuxnani.in:/home/tuxnani/f1$ 

ఐతే కన్సోల్ యొక్క ఆకృతి, తీరు-తెన్నులు వాడే షెల్ పైన మరియు వాడుకరి పెట్టుకున్న అమరికల మీద ఆధారపడి ఉంటుంది, స్థూలంగా కామాండ్ లైన్ అన్నా షెల్ అన్నా ఒకటే అయినప్పటికీ, కమాండ్ లైన్ అనేది కమాండ్ లు చొప్పించే అంతరవర్తిని అయితే షెల్ అనేది కెర్నెల్ కు ఒక అంతరవర్తినిలా ఉండే చిన్ని సాఫ్ట్వేర్. షెల్ లో చాలా రకాలు ఉన్నాయి, sh, bash, ksh, zsh, మొదలగునవి. అన్ని ప్రముఖ లినక్స్ పంపకాల్లో BASH అనే షెల్ అప్రమేయంగా ఉంటుంది.
కన్సోల్ ద్వారా చొప్పించే నిర్దేశాలు చిన్నగా ఉంటాయి వాటి అసలు పదాలకు దగ్గరగా. ఉదాహరణకు list నిర్దేశం తీస్కుంటే అది సంచయంలో ఉన్న అన్ని దస్త్రాల వివరాలను ఒక జాబితా రూపంలో చూపేందుకు వాడబడుతుంది, కానీ ఈ నిర్దేశాన్ని ls అన్న రెండు అక్షరాలతో చెబితే చాలు. ఇలా నిర్దేశాలుండటానికి చారిత్రక కారణాలున్నాయి. ఒకప్పుడు వాడుకరి వాడే మెషిన్ కు సర్వర్ కు మధ్య దూరం, అలానే విషయాలు పారే వేగం, పదాలు టంకించే వేగంలో చాలా నిదానం ఉండేది, అందువలన అతి తక్కువ అక్షరాలతో కమాండ్ లను రూపొందించే పద్ధతి మొదలయింది. అయితే కమాండ్లను బట్టీ పట్టాల్సిన అవసరం లేదు, మీరు వాడే కొద్దీ మీకు అలవాటయిపోతాయి.
కొన్ని తరచూ వాడే కమాండ్లు.
ls - ఈ నిర్దేశంతో మీరు సంచయంలోని దస్త్రాల యొక్క పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
pwd - మీరు ప్రస్తుతం ఏ సంచయంలో ఉన్నారో తెలుసుకోవచ్చు
cd - సంచయాలు మార్చుకునేందుకు
rm - దస్త్రాలను తొలగిస్తుంది
rmdir - ఖాళీ సంచయాన్ని తొలగిస్తుంది
mkdir -కొత్త సంచయాన్ని సృష్టిస్తుంది
ps - వర్తమాన ప్రోసెస్లను చూపిస్తుంది
cp - దస్త్రాన్ని నకలు తీస్తుంది
mv - ఒక దస్త్రాన్ని స్థానమార్పిడి చేస్తుంది (దస్త్రం పేరు మార్చడానికి)
grep - ఒక దస్త్రంలో పదాలను వెతికి చూపిస్తుంది
find - ఒక దస్త్రాన్ని అన్వేషిస్తుంది
man - నిర్దేశాల మ్యానువల్ పేజీలను చూపిస్తుంది 

కిటుకు : మీరు ఏదయినా నిర్దేశం గురించి తెలుసుకోవాలంటే man <నిర్దేశం> ను వాడి ఆ నిర్దేశం గురించి తెలుసుకోవచ్చు.

(సశేషం)

Thursday, December 1, 2011

ఆండ్రాయిడ్ ఇప్పుడు మీ కంప్యూటర్లో కూడా!

ప్రముఖ చలిత నిర్వహణా వ్యవస్థ(Mobile Operating System) ఆండ్రాయిడ్ ఇప్పుడు మీ కంప్యూటర్ లో స్థాపించుకునే విధంగా అందుబాటులో కలదు.


ఆండ్రాయిడ్-x86 అనేది Eee PC నోట్‍బుక్ ల కోసం గూగుల్ వారు తయారు చేసిన x86(32 bit) ఆర్కిటెక్చర్ నివ. ప్రస్తుతం ఈ నివ 4 వ వెర్షన్ రిలీజ్ అయింది; లైవ్ సీడీ రూపంలో అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్-x86 4.0 ఆండ్రాయిడ్ 4.0.1 (ఐస్‍క్రీం సాండ్విచ్) పై ఆధార పడి ఉంది మరియు ఏఎండీ రేడియోన్ చిప్‍సెట్లకు ఓపెన్‍జీఎల్ ఈఎస్ హార్డ్‍వేర్ యాక్సెలరేషన్ కలిగి ఉంది, ఇంకా మల్టిటచ్ మరియు వైఫై కి కూడా తోడ్పాటు ఉంది.

ఇది ఇంకా అభివృద్ధి చేయబడుతోంది కాబట్టీ ఆడియో వెబ్‍క్యాం ఈథర్‍నెట్ ఇంకా హార్డ్‍వేర్ యాక్సెలరేషన్ వంటి వెసులుబాట్లు ఇంటెల్ ఆధారిత వేదికలకు అందుబాటులో లేవు.

ఆసూస్ ఈ పీసీ మరియు లాపుటాపులపై, వ్యూసానిక్ వ్యూప్యాడ్ 10, డెల్ ఇన్‍స్పిరాన్ మిని డ్యుఓ, సాంసంగ్ Q1U, విలివ్ S5 ఇంకా లెనోవో థింక్‍ప్యాడ్ x61 టాబ్లెట్ ల పై పరీక్షించబడింది.

ఆండ్రాయిడ్-x86 4.0 ను ఇప్పుడే సాఫ్ట్‍పీడియా నుండి దింపుకోలు చేస్కోండి. ఈ ఐఎస్‍ఓ ప్రస్తుతం AMD వారి Brazos వేదికకు పనికొస్తుంది.


తొలి పలుకులు

లినక్స్ ను వాడే వారు దీనిని కేవలం ఒక నిర్వహణ వ్యవస్థ(నివ)లా కాకుండా ఒక సిద్ధాంతంలా పరిగణిస్తారు. స్వేచ్ఛ మరియు నిర్బంధత అనే సూత్రాల పై ఆధారపడి ఉన్న ఈ నివ కేవలం సాంకేతికంగా చాలా పై స్థాయిలో ఉన్న వారికే పరిమితం అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. వాడుకరులకు కావలసిన ఉపకరణాలను కావల్సినంత వరకూ అందించటంలో లినక్స్ తరువాతే ఏ వ్యవస్థ అయినా. కాగా లినక్స్ ఉచితంగా అందుబాటులో ఉన్నా -- మన సొంత భాషలో అందుబాటులో ఉన్నా చాలా మంది ఇంకా వాడటానికి జంకుతున్నారు. దీనికి ముఖ్య కారణం లినక్స్ చేరుకునే ముందే ఇతర నివలు జానాల్లో చేరుకోవడం. అవే అత్యంత సులువైనవని జనం నమ్మడం. ఈ బ్లాగులో లినక్స్ నివ గురించి ప్రత్యేకంగా వ్యాసాలు రాస్తాను. ఇప్పటికే కొన్ని లినక్స్ పై రాయబడుతున్న బ్లాగులు కలవు. అయితే అవి లినక్స్ ప్రత్యేకంగా లేవు, ఇతర సాంకేతిక విషయాలతో పాటుగా లినక్స్ వ్యాసాలు ఉన్నాయి లేదా కేవలం తెలుగు లినక్స్ వరకే పరిమితమవుతున్నాయి.
ఈ బ్లాగులో లినక్సే ముఖ్యం మరియు ప్రత్యేకం.
ఇక్కడ వ్యాసాలు సాధారణంగా ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై ఉంటాయి. అలానే చదువరులు అడిగే వ్యాసాలను కూడా పరిగణలోకి తీసుకుంటాను. 

ఈ టపాను పంచుకోండి