నేను గతంలో ఎన్నోసార్లు ఇతరులతో చెప్పినట్టు, సలహా ఇచ్చినట్టు ప్రపంచానికి ఫైర్ఫాక్స్ అవసరం ఉంది. స్వేచ్ఛా సాఫ్టువేర్ల గురించి పరిచయం లేని వారికి దాన్ని గురించి చెప్పటంలో ఫైర్ఫాక్స్ చేసే సహాయం అంతా ఇంతా కాదు. అయితే ఫైర్ఫాక్స్ కి నేడున్న ప్రధాన సవాళ్ళలో ఒకటి ఈ కింది ట్రెండ్ ను తిరగరాయటం :
వివిధ వికీపీడియన్ల ద్వారా, CC BY 3.0
నా అంచనా ప్రకారం ఫైర్ఫాక్స్ ఎదుగుదలకు అతిపెద్ద అవరోధం - లేదా తన ప్రస్తుత మార్కెట్ షేర్ ను కాపాడుకోటంలో గల అవరోధం - జనాల నరనరాల్లోకీ పాతుకుపోయిన "గూగుల్ క్రోమ్ అంటే మెరుగైన బ్రౌజర్ (విహారిణి)" అనే అపోహ.
ఆండ్రాయిడ్ ఉపకరణాల్లో అప్రమేయంగా క్రోమ్ ఉండటం ఐఓఎస్ లో క్రోం పని చేయటం మొదలయినవి క్రోం కు ఉన్న ప్రత్యేకతలు. అదే ఫైర్ఫాక్స్ కావాలంటే వాడుకరి ప్రత్యేకించి ఆండ్రాయిడ్ ఉపకరణంలో స్థాపన చేసుకోవాలి. ఐఓఎస్ కి అందుబాటులో లేదు కూడా (భవిష్యత్తులో రావచ్చేమో!). అన్నిటికన్నా మించి గూగుల్ వద్ద ఉన్న వాణిజ్య ప్రకటనల అతిపెద్ద సామ్రాజ్యం ద్వారా క్రోం ను ప్రయత్నించమని, అతి మెరుగైన, త్వరితగతిన పని చేసే విహారిణి క్రోమే అన్న ప్రచారంతో మొజిల్లా వారి ఫైర్ఫాక్స్ ప్రచార ప్రయత్నాలను పటాపంచలు చేస్తుంది క్రోం.
ఇక్కడ విహారిణుల విషయమై ఏకఛత్రాదిపత్యం ఎందుకు కూడదు, ఎల్లపుడూ విహారిణుల మధ్య పోటీ ఎందుకు ఉండాలి అన్న విషయమై విశ్లేషిద్దాం. 2000వ దశకంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి విరుద్ధంగా ఫైర్ఫాక్స్ జరిపిన పోరాటాన్ని, ప్రస్తుతం ఫైర్ఫాక్స్ ఎదుర్కొంటున్న సవాళ్ళనూ పరిశీలిద్దాం. అలాగే ఫైర్ఫాక్స్ ఏ విధంగా తన పతనాన్ని (లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని) ఎలా ఎదుర్కోవచ్చు అన్న విషయం కూడా పరికిద్దాం.
నేపధ్యం : విహారిణుల మధ్య పోటీ ఎందుకు ఉపయోగకరం
ఏ రంగంలోనైనా ఆఖరి వాడుకరి మేలు కోసం ఉత్పత్తుల నడుమ పోటీ ఉచితమే. తద్వారా వచ్చే లాభాలు అనేకం. ఎవరైనా అడగొచ్చు : గూగుల్ క్రోమ్ విహారిణుల రంగంలో అగ్రగామి అయితే ఎంత? ఏనాటికైనా ప్రతి వాడుకరికీ విహారిణిని మార్చుకునే అవకాశం ఉన్నంతవరకూ ఈ విషయంలో నష్టమేమీ లేదు కదా అని.
కానీ అలాంటి భావాలు మనం మాఅర్చుకోవాలి. దానికెన్నో కారణాలు.
ఒక విహారిణి ఏకాధిపత్యం చెయ్యటం మొదలుపెడితే విహారిణి ఆధారిత సేవలు అందించే కంపెనీవాళ్ళంతా ఆ ఒక్క విహారిణిని దృష్టిలో పెట్టుకుని మిగితా విహారిణులను నిర్లక్ష్యం చేస్తూ సేవలు రూపొందిస్తారు. ఉదాహరణకి వెబ్ డెవలపర్లు వారి వాడుకరులు అధికం క్రోమ్ ను వాడుతున్నారని మిగితా విహారిణులపై తమ ఉత్పత్తులను పరీక్షించడం మానేయవచ్చు.
మరొక ముఖ్యమైన విషయం అలాంటి సందర్భంలో ఆ ఒక్క విహారిణి యజమానుదారుడు/హక్కుదారుడు విహారిణి-జాలం-అంతర్జాలం నియమాలను నిబంధనలను శాసించడం మొదలుపెడతారు. ఆ విధంగా ప్రత్యర్థి విహారిణులు అలాంటి నిబంధనలకు లోబడకపోతే తమంతట తాముగా వాడకం నుండి వైదొలగుతాయి. అక్కడ మొదలు అందరికీ అన్ని వసతులు సమానంగా కాకుండా కొందరికే కొన్ని వసతులే అన్న నినాదాలు సమాజాన్ని పట్టి పీడిస్తాయి. ఇదే రకం పోకడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6 విహారిణుల రారాజుగా ఉన్న రోజుల్లో తెరపైకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ యధేచ్ఛగా తనకు కావాల్సిన ప్రకటనలు, వైరస్లు, తద్వారా ఆంటివైరస్లు, వాడుకర్ల సమాచారం లాంటివి నడుపుకునేందుకు ఈ విహారిణిని బాగా వాడుకుంది. ఈ పరిస్థితి ఫైర్ఫాక్స్ వచ్చి పోటీకి నిలబడ్డ నాడు మాత్రమే శమించింది.
ఈ సారో కొత్త రకం జగడం
ఇంతకు ముందు జరిగిన విహారిణుల సమరం (ఇది ఇలాంటి రెండో యుద్ధం)
చాలా సులువైనది. ఎన్నో సంవత్సరాలుగా మారని వ్యర్థమైన విహారిణి (ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్) కి విరుద్ధంగా సరికొత్త మెరుగైన ఉత్పత్తి ఫైర్ఫాక్స్ ఉంది. ఆ రోజుల్లో ఫైర్ఫాక్స్ అందించిన ట్యాబుల విహరణ ఒక పక్కైతే, నాలుగైదు కిటికీలతో రోతగా ఉన్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మరో పక్క.
కానీ ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. ఈ సమరం చాలా భీకరంగా ఉంది. అన్ని ఉత్పత్తులు చూడటానికి ఒకేలా ఉన్నాయి. ఫైర్ఫాక్స్ ట్యాబులను అందంగా వంకీలు తిరిగి ఉండేలా రూపొందించిన వెంటనే అది క్రోమ్ లో ప్రత్యక్షమయింది. రెండు విహారిణులూ చాలా వరకూ వివరాలను తగ్గించి, దృశ్యపరంగా మరింత నాజూకుగా కనపడేలా తయారయ్యాయి. నాజూకుగా కనపడటమే కాదు, పని చేయటంలోనూ రెండిటికీ వేగమే. రెండు విహారిణులు వాడుకరి ప్రాధాన్యతలు గుర్తు పెట్టుకొని లాప్టాప్, డెస్క్టాప్, మొబైల్, ట్యాబ్ లలో వాడినపుడు ఒకేలా ఉండేలా, సంకేతపదాలు, విహరణ చరిత్ర, పొడిగింతలు ఒకచోట ఉన్నవి మరో చోట పని చేసేలా కుదుర్చుకున్నాయి.
కానీ తేడాలు ఉన్నాయి. అందులో ఒకటి రెండిటినీ నడిపించే సిద్ధాంతాలు వేరు వేరు.
ఫైర్ఫాక్స్ ను తీర్చిదిద్దిన మొజిల్లా కార్పరేషన్ మొజిల్లా ఫౌండేషన్ అనే ఒక లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. కానీ క్రోమ్ గూగుల్ ద్వారా తయారు కాబడింది. ఇంటర్నెట్ పై ఏకఛత్రాధిపత్యం కోసం పాటుపడుతూ, ఎన్నడూ లేనంతగా వాడుకరుల సొంత సమాచారాన్ని తస్కరిస్తూ, లాభాల కోసం వాడుకొనే ఒక సంస్థ గూగుల్. ఫైర్ఫాక్స్ ను రూపొందించేది మీరు-నేను మనమే, ఔత్సాహికుల ద్వారా రూపొందుతుంది. సర్వ మానవ కల్యాణం, ఇంటర్నెట్ ను అందరికీ మరింత మెరుగ్గా, దాపరికాల్లేకుండా చేరువలోకి తేవటం. అదే క్రోమ్ విషయంలో, దాని రూపకర్త గూగుల్ కు డబ్బే లక్ష్యం. గూగుల్ అందించే వివిధ సేవలకు క్రోమ్ వేదిక.
ఫైర్ఫాక్స్ క్రోమ్ కన్నా మెరుగు అనేందుకు మరొక్క కారణం ఫైర్ఫాక్స్ వాడే ఓపెన్ సోర్స్ విధానం. ఫైర్ఫాక్స్ ఆపాదమస్తకమూ పూర్తి స్థాయిలో సోర్స్ కోడ్ అందుబాటులో ఉన్న విహారిణి. అందువలన మీకు నచ్చిన విధంగా సోర్స్ కోడ్ లో మార్పులు చేసి మీ వరకూ వాడుకోవచ్చు, ప్రపంచానికి అందించవచ్చు కూడా. క్రోమ్ కోడ్ స్వేచ్ఛా సాఫ్టువేర్ క్రోమియం నుండి తీసుకున్నప్పటికీ ఆపైన చాలా వరకూ బాహ్యంగా అందుబాటులో లేని తెలీని రహస్యమైన కోడ్ చాలా వరకూ క్రోం వాడుతుంది. సముదాయం కోసం సముదాయ సభ్యులు రూపొందించిన విహారిణి ఎప్పటికైనా సముదాయం కోసం బయటి కంపెనీ రూపొందించిన ఉత్పత్తి కన్నా మెరుగ్గా పని చేయగలదు.
గమ్మత్తైన విషయమేమిటంటే ఈ విషయాలు సామాన్యుడికి ఎలా తెలపాలి. సాధారణ జనాల వరకూ ఈ విషయాలను ఎలా తీసుకుపోవాలి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6 కన్నా ఫైర్ఫాక్స్ మెరుగని ఎవరైనా ఇట్టే చెప్పెయ్యగలరు. కానీ క్రోం కన్నా ఫైర్ఫాక్స్ మెరుగని ఎలా చెప్పగలం?
మన వ్యక్తిగత విషయాల గోప్యత విషయంలో ఫైర్ఫాక్స్ మెరుగని చూపించి మరీ చెప్పగలం.
ఫైర్ఫాక్స్ పైచేయి
ఫైర్ఫాక్స్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కానీ అన్నిటికన్నా మన గోప్యతను కాపాడటంలో ఫైర్ఫాక్స్ పైచేయి లో ఉంది. క్రోం ద్వారా గూగుల్ వాడు మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నాము అన్న విషయంతో సహా పసిగట్టేస్తున్నాడు (https://maps.google.com/locationhistory/b/0)
ఫైర్ఫాక్స్ ఎప్పటికి ఇలాంటి చర్యలకు పాల్పడదు, అలా చెయ్యాలనుకునే గూగుల్ కూడా ఫైర్ఫాక్స్ మీద వాడుతున్నపుడు మన చర్యలను పసిగట్టనీయకుండా నిర్వీర్యం చేసే అస్త్రాలు ఫైర్ఫాక్స్ వద్ద ఉన్నాయి. about:config కు వెళ్ళి ఒక చిన్న మార్పు చేయడం ద్వారా ఎలాంటి సంస్థ మన అడుగుజాడల్ని అనుసరించకుండా అరికట్టవచ్చు (ప్రివసీ బాడ్జర్
పొడిగింత లా పని చేస్తుంది). ఫైర్ఫాక్స్ ద్వారా మీ బ్యాంకు అకౌంట్ వివరాల లాంటి సున్నితమైన అంశాలను వేరే ఎవ్వరూ (తస్కరించకుండా) దుర్వినియోగం చేయకుండా అరికడుతుంది.
ఫైర్ఫాక్స్ వారి మొదటి పేజీలోజాలసురక్షకు సంబంధించిన సూచనలూ ఉంటాయి.
అదే సమయాన క్రోమ్, గూగుల్ మీ కదలికలు, మీ వెబ్సైట్ సందర్శనాలు, మీరు చేసే ప్రతి చర్య మీద నిఘా వేసి ఉంచుతారు. తద్వారా మీ అలవాట్లను తెలుసుకుని తగిన వాణిజ్య ప్రకటనలు మీకు చూపిస్తారు.
దీని ద్వారా నాకూ కొంత మేలుందోయ్, నాకు తగ్గ ప్రకటనలు నేను వెతక్కుండానే నా చెంతకొస్తున్నాయని మీరంటారా! అయితే అదే సమయంలో మీరు మీ అతి సన్నిహితులతో జాలం ద్వారా మాట్లాడే (చాటింగ్/మెయిల్/వెబ్) సున్నితమైన, మీకు మాత్రమే వ్యక్తిగతమైన విషయాలు కూడా మీరు అదే విధంగా గూగుల్ కు అందిస్తున్నారన్న సంగతి మరవద్దు.
బేసిక్ గా, ఫైర్ఫాక్స్ క్రోం వాడకం ఒకేలా ఉంటుంది, రెండిటా వాడే ఉపకరణాలూ ఒకేలా ఉంటాయి. కానీ అవి లోలోపల పని చేసే విధానంలోనే చాలా తేడా ఉంది. ఒకటి మీ వ్యక్తిత్వానికి వ్యక్తిగత విషయాలకూ ప్రాధాన్యతనిచ్చి గోప్యత పాటిస్తే, మరొకటి మీ విషయాలన్నిటిని స్వార్ధ పూరిత కంపెనీలకు అమ్ముకునే దత్తాంశాలుగా పరిగణిస్తుంది. ఒకటి సమూహం ద్వారా సమూహం కోసం రూపొందితే, మరొకటి లాభాల కోసం జనాల వ్యక్తిగత విషయాలను నిఘావేసే సంస్థ కోసం రూపొందింది.
రెంటిలో మీ ఎంపిక ఏదో వేరే చెప్పనక్కరలేదేమో.
(Harry Chapman ఆంగ్ల బ్లాగు టపాకు తెలుగు అనువాదం, ద్వారా లభ్యం )
ప్రపంచంలో ఏ దేశపు ఆర్ధిక వ్యవస్థ తీసుకున్నా సరే, ఆయా దేశాల్లో(భారతదేశం సహా) ఐటీ రంగమే మెరుగయిన ఉద్యోగావకాశాలను అందిస్తుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే అమెరికా లో 8 శాతం ఉన్న సగటు నిరుద్యోగుల సంఖ్య, ఐటీ రంగానికి కేవలం 2 శాతమే ఉంది. అలానే ఈ ఐటీ ఉద్యోగాల్లో సింహ భాగం లినక్స్ సంబంధిత ఉపకరణాల పై ఆధారపడి ఉంది. సిస్ అద్మిన్లు, మొదలు పబ్లిషింగ్ చేసే వారు కూడా లినక్స్ జ్ఞానం కలవారాయ్ ఉండాలన్నది బయటకు చెప్పని నిజం. అయితే ఈ సందర్భంలో లినక్స్ ఫౌండేషన్ వారు ఒక చిన్న నివేదికను విడుదల చేసారు. అది ఇక్కడ పరిశీలించండి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి కంపెనీ లినక్స్ లో నిష్ణాతులయిన ఉద్యోగులు కావాలి. కానీ మన విద్యార్థులు ఏమి చేస్తున్నారు? చేతి కింద ఉన్న అవకాశాన్ని ఎందుకు జార విడుస్తున్నారు?
కన్సోల్ అన్నా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్నా షెల్ అన్నా టెర్మినల్ అన్నా ఒకటే.
ఒక నల్లని తెర పై చిన్ని చిన్ని నిర్దేశాలను కేవలం కీబోర్డ్ వాడి చొప్పించడాన్ని చూసే ఉంటారు, అక్కడ మౌస్ ని ఉపయోగించరు. ఇది సాధారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆధారిత నివ్య లో కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది.
లినక్స్ వాడుకరులకు అత్యంత సౌలభ్యాన్ని అందిస్తుందీ కన్సోల్.
మొదట్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నా, వాడే కొద్దీ రాముడి బంటు హనుమంతన్నలా మీ పనులు చేస్తుంది. ఒక ఉదాహరణ, ఒక సంచయంలోని అన్ని దస్త్రాల పేర్లూ ఆఖరున మీ పేరు జోడించాలి; అదీ, ఆ సంచయంలో ఒక వంద దస్త్రాలు ఉన్నాయనుకుందాం. ఎంత సమయం పడుతుందీ పనికి? కన్సోల్ లో ఒక క్షణం కూడా పట్టదు, పైగా మీరు ఒకటి-రెండూ మహా అయితే ఆరు లైన్లు చొప్పించాలి అంతే!
ఒక్కో లినక్స్ పంపకంలో ఈ కన్సోల్ ఒక్కోలా ఉంటుంది. మీ మెషీన్ లో వాడుకరి పేరు తరువాత @ తరువాత మెషిన్ పేరు, అప్రమేయ సంచయంలో మీ ప్రాంప్ట్ తో ఉంటుంది.
user@linux ~/$
ఉదాహరణకు వాడుకరి పేరు linuxudu, మెషిన్ పేరు tuxnani.in, సంచయం /home/tuxnani/f1 అనుకోండి, అప్పుడు ప్రాంప్ట్ కింద చూపిన విధంగా ఉంటుంది.
linuxudu@tuxnani.in:/home/tuxnani/f1$
ఐతే కన్సోల్ యొక్క ఆకృతి, తీరు-తెన్నులు వాడే షెల్ పైన మరియు వాడుకరి పెట్టుకున్న అమరికల మీద ఆధారపడి ఉంటుంది, స్థూలంగా కామాండ్ లైన్ అన్నా షెల్ అన్నా ఒకటే అయినప్పటికీ, కమాండ్ లైన్ అనేది కమాండ్ లు చొప్పించే అంతరవర్తిని అయితే షెల్ అనేది కెర్నెల్ కు ఒక అంతరవర్తినిలా ఉండే చిన్ని సాఫ్ట్వేర్. షెల్ లో చాలా రకాలు ఉన్నాయి, sh, bash, ksh, zsh, మొదలగునవి. అన్ని ప్రముఖ లినక్స్ పంపకాల్లో BASH అనే షెల్ అప్రమేయంగా ఉంటుంది.
కన్సోల్ ద్వారా చొప్పించే నిర్దేశాలు చిన్నగా ఉంటాయి వాటి అసలు పదాలకు దగ్గరగా. ఉదాహరణకు list నిర్దేశం తీస్కుంటే అది సంచయంలో ఉన్న అన్ని దస్త్రాల వివరాలను ఒక జాబితా రూపంలో చూపేందుకు వాడబడుతుంది, కానీ ఈ నిర్దేశాన్ని ls అన్న రెండు అక్షరాలతో చెబితే చాలు. ఇలా నిర్దేశాలుండటానికి చారిత్రక కారణాలున్నాయి. ఒకప్పుడు వాడుకరి వాడే మెషిన్ కు సర్వర్ కు మధ్య దూరం, అలానే విషయాలు పారే వేగం, పదాలు టంకించే వేగంలో చాలా నిదానం ఉండేది, అందువలన అతి తక్కువ అక్షరాలతో కమాండ్ లను రూపొందించే పద్ధతి మొదలయింది. అయితే కమాండ్లను బట్టీ పట్టాల్సిన అవసరం లేదు, మీరు వాడే కొద్దీ మీకు అలవాటయిపోతాయి.
కొన్ని తరచూ వాడే కమాండ్లు.
ls - ఈ నిర్దేశంతో మీరు సంచయంలోని దస్త్రాల యొక్క పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
pwd - మీరు ప్రస్తుతం ఏ సంచయంలో ఉన్నారో తెలుసుకోవచ్చు
cd - సంచయాలు మార్చుకునేందుకు
rm - దస్త్రాలను తొలగిస్తుంది
rmdir - ఖాళీ సంచయాన్ని తొలగిస్తుంది
mkdir -కొత్త సంచయాన్ని సృష్టిస్తుంది
ps - వర్తమాన ప్రోసెస్లను చూపిస్తుంది
cp - దస్త్రాన్ని నకలు తీస్తుంది
mv - ఒక దస్త్రాన్ని స్థానమార్పిడి చేస్తుంది (దస్త్రం పేరు మార్చడానికి)
grep - ఒక దస్త్రంలో పదాలను వెతికి చూపిస్తుంది
find - ఒక దస్త్రాన్ని అన్వేషిస్తుంది
man - నిర్దేశాల మ్యానువల్ పేజీలను చూపిస్తుంది
కిటుకు : మీరు ఏదయినా నిర్దేశం గురించి తెలుసుకోవాలంటే man <నిర్దేశం> ను వాడి ఆ నిర్దేశం గురించి తెలుసుకోవచ్చు.
ప్రముఖ చలిత నిర్వహణా వ్యవస్థ(Mobile Operating System) ఆండ్రాయిడ్ ఇప్పుడు మీ కంప్యూటర్ లో స్థాపించుకునే విధంగా అందుబాటులో కలదు.
ఆండ్రాయిడ్-x86 అనేది Eee PC నోట్‍బుక్ ల కోసం గూగుల్ వారు తయారు చేసిన x86(32 bit) ఆర్కిటెక్చర్ నివ. ప్రస్తుతం ఈ నివ 4 వ వెర్షన్ రిలీజ్ అయింది; లైవ్ సీడీ రూపంలో అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్-x86 4.0 ఆండ్రాయిడ్ 4.0.1 (ఐస్‍క్రీం సాండ్విచ్) పై ఆధార పడి ఉంది మరియు ఏఎండీ రేడియోన్ చిప్‍సెట్లకు ఓపెన్‍జీఎల్ ఈఎస్ హార్డ్‍వేర్ యాక్సెలరేషన్ కలిగి ఉంది, ఇంకా మల్టిటచ్ మరియు వైఫై కి కూడా తోడ్పాటు ఉంది.
ఇది ఇంకా అభివృద్ధి చేయబడుతోంది కాబట్టీ ఆడియో వెబ్‍క్యాం ఈథర్‍నెట్ ఇంకా హార్డ్‍వేర్ యాక్సెలరేషన్ వంటి వెసులుబాట్లు ఇంటెల్ ఆధారిత వేదికలకు అందుబాటులో లేవు.
ఆసూస్ ఈ పీసీ మరియు లాపుటాపులపై, వ్యూసానిక్ వ్యూప్యాడ్ 10, డెల్ ఇన్‍స్పిరాన్ మిని డ్యుఓ, సాంసంగ్ Q1U, విలివ్ S5 ఇంకా లెనోవో థింక్‍ప్యాడ్ x61 టాబ్లెట్ ల పై పరీక్షించబడింది.
ఆండ్రాయిడ్-x86 4.0 ను ఇప్పుడే సాఫ్ట్‍పీడియా నుండి దింపుకోలు చేస్కోండి. ఈ ఐఎస్‍ఓ ప్రస్తుతం AMD వారి Brazos వేదికకు పనికొస్తుంది.
లినక్స్ ను వాడే వారు దీనిని కేవలం ఒక నిర్వహణ వ్యవస్థ(నివ)లా కాకుండా ఒక సిద్ధాంతంలా పరిగణిస్తారు. స్వేచ్ఛ మరియు నిర్బంధత అనే సూత్రాల పై ఆధారపడి ఉన్న ఈ నివ కేవలం సాంకేతికంగా చాలా పై స్థాయిలో ఉన్న వారికే పరిమితం అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. వాడుకరులకు కావలసిన ఉపకరణాలను కావల్సినంత వరకూ అందించటంలో లినక్స్ తరువాతే ఏ వ్యవస్థ అయినా. కాగా లినక్స్ ఉచితంగా అందుబాటులో ఉన్నా -- మన సొంత భాషలో అందుబాటులో ఉన్నా చాలా మంది ఇంకా వాడటానికి జంకుతున్నారు. దీనికి ముఖ్య కారణం లినక్స్ చేరుకునే ముందే ఇతర నివలు జానాల్లో చేరుకోవడం. అవే అత్యంత సులువైనవని జనం నమ్మడం. ఈ బ్లాగులో లినక్స్ నివ గురించి ప్రత్యేకంగా వ్యాసాలు రాస్తాను. ఇప్పటికే కొన్ని లినక్స్ పై రాయబడుతున్న బ్లాగులు కలవు. అయితే అవి లినక్స్ ప్రత్యేకంగా లేవు, ఇతర సాంకేతిక విషయాలతో పాటుగా లినక్స్ వ్యాసాలు ఉన్నాయి లేదా కేవలం తెలుగు లినక్స్ వరకే పరిమితమవుతున్నాయి.
ఈ బ్లాగులో లినక్సే ముఖ్యం మరియు ప్రత్యేకం.
ఇక్కడ వ్యాసాలు సాధారణంగా ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై ఉంటాయి. అలానే చదువరులు అడిగే వ్యాసాలను కూడా పరిగణలోకి తీసుకుంటాను.