Monday, December 26, 2011

కన్సోల్ -- లినక్స్ లో తొలి అడుగులు


కన్సోల్ అన్నా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్నా షెల్ అన్నా టెర్మినల్ అన్నా ఒకటే.
ఒక నల్లని తెర పై చిన్ని చిన్ని నిర్దేశాలను కేవలం కీబోర్డ్ వాడి చొప్పించడాన్ని చూసే ఉంటారు, అక్కడ మౌస్ ని ఉపయోగించరు. ఇది సాధారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆధారిత నివ్య లో కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది.
లినక్స్ వాడుకరులకు అత్యంత సౌలభ్యాన్ని అందిస్తుందీ కన్సోల్.
మొదట్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నా, వాడే కొద్దీ రాముడి బంటు హనుమంతన్నలా మీ పనులు చేస్తుంది. ఒక ఉదాహరణ, ఒక సంచయంలోని అన్ని దస్త్రాల పేర్లూ ఆఖరున మీ పేరు జోడించాలి; అదీ, ఆ సంచయంలో ఒక వంద దస్త్రాలు ఉన్నాయనుకుందాం. ఎంత సమయం పడుతుందీ పనికి? కన్సోల్ లో ఒక క్షణం కూడా పట్టదు, పైగా మీరు ఒకటి-రెండూ మహా అయితే ఆరు లైన్లు చొప్పించాలి అంతే!
ఒక్కో లినక్స్ పంపకంలో ఈ కన్సోల్ ఒక్కోలా ఉంటుంది. మీ మెషీన్ లో వాడుకరి పేరు తరువాత @ తరువాత మెషిన్ పేరు, అప్రమేయ సంచయంలో మీ ప్రాంప్ట్ తో ఉంటుంది.
user@linux ~/$ 
ఉదాహరణకు వాడుకరి పేరు linuxudu, మెషిన్ పేరు tuxnani.in, సంచయం /home/tuxnani/f1 అనుకోండి, అప్పుడు ప్రాంప్ట్ కింద చూపిన విధంగా ఉంటుంది.
linuxudu@tuxnani.in:/home/tuxnani/f1$ 

ఐతే కన్సోల్ యొక్క ఆకృతి, తీరు-తెన్నులు వాడే షెల్ పైన మరియు వాడుకరి పెట్టుకున్న అమరికల మీద ఆధారపడి ఉంటుంది, స్థూలంగా కామాండ్ లైన్ అన్నా షెల్ అన్నా ఒకటే అయినప్పటికీ, కమాండ్ లైన్ అనేది కమాండ్ లు చొప్పించే అంతరవర్తిని అయితే షెల్ అనేది కెర్నెల్ కు ఒక అంతరవర్తినిలా ఉండే చిన్ని సాఫ్ట్వేర్. షెల్ లో చాలా రకాలు ఉన్నాయి, sh, bash, ksh, zsh, మొదలగునవి. అన్ని ప్రముఖ లినక్స్ పంపకాల్లో BASH అనే షెల్ అప్రమేయంగా ఉంటుంది.
కన్సోల్ ద్వారా చొప్పించే నిర్దేశాలు చిన్నగా ఉంటాయి వాటి అసలు పదాలకు దగ్గరగా. ఉదాహరణకు list నిర్దేశం తీస్కుంటే అది సంచయంలో ఉన్న అన్ని దస్త్రాల వివరాలను ఒక జాబితా రూపంలో చూపేందుకు వాడబడుతుంది, కానీ ఈ నిర్దేశాన్ని ls అన్న రెండు అక్షరాలతో చెబితే చాలు. ఇలా నిర్దేశాలుండటానికి చారిత్రక కారణాలున్నాయి. ఒకప్పుడు వాడుకరి వాడే మెషిన్ కు సర్వర్ కు మధ్య దూరం, అలానే విషయాలు పారే వేగం, పదాలు టంకించే వేగంలో చాలా నిదానం ఉండేది, అందువలన అతి తక్కువ అక్షరాలతో కమాండ్ లను రూపొందించే పద్ధతి మొదలయింది. అయితే కమాండ్లను బట్టీ పట్టాల్సిన అవసరం లేదు, మీరు వాడే కొద్దీ మీకు అలవాటయిపోతాయి.
కొన్ని తరచూ వాడే కమాండ్లు.
ls - ఈ నిర్దేశంతో మీరు సంచయంలోని దస్త్రాల యొక్క పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
pwd - మీరు ప్రస్తుతం ఏ సంచయంలో ఉన్నారో తెలుసుకోవచ్చు
cd - సంచయాలు మార్చుకునేందుకు
rm - దస్త్రాలను తొలగిస్తుంది
rmdir - ఖాళీ సంచయాన్ని తొలగిస్తుంది
mkdir -కొత్త సంచయాన్ని సృష్టిస్తుంది
ps - వర్తమాన ప్రోసెస్లను చూపిస్తుంది
cp - దస్త్రాన్ని నకలు తీస్తుంది
mv - ఒక దస్త్రాన్ని స్థానమార్పిడి చేస్తుంది (దస్త్రం పేరు మార్చడానికి)
grep - ఒక దస్త్రంలో పదాలను వెతికి చూపిస్తుంది
find - ఒక దస్త్రాన్ని అన్వేషిస్తుంది
man - నిర్దేశాల మ్యానువల్ పేజీలను చూపిస్తుంది 

కిటుకు : మీరు ఏదయినా నిర్దేశం గురించి తెలుసుకోవాలంటే man <నిర్దేశం> ను వాడి ఆ నిర్దేశం గురించి తెలుసుకోవచ్చు.

(సశేషం)

1 comment:

  1. రహ్మాన్ గారు

    టెక్నికల్ విషయాలను తెలుగు వ్రాయడం ఏంటో కష్టమో నాకు ( కనీసం నా వరకు కష్టమే, మేకు కాకపోయినా ) తెలుసు... కాని ఇలాంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టినందుకు అభినందనలు.

    ReplyDelete

ఈ టపాను పంచుకోండి